దురాశ దుఃఖానికి చేటు - సింహం నక్కల కథ

 అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సింహం, కొన్ని నక్కలు, కొన్ని జింకలు ఇంకా ఇతర జంతువులు ఉన్నాయి. 

సింహం రోజూ వేటాడి తన ఆకలి తీర్చుకునేది. నక్కలు వాటి సహజ ప్రవర్తన రీత్యా వేటాడటం తెలియకపోవడంతో సింహం వేటాడి తినగా మిగిలిన మాంసం తింటూ కాలం గడిపేవి. 

కొంత కాలం అలా గడిచింది. ఒక రోజు ఒక నక్కకి ఆకలి తీరలేదు. అది అప్పుడు ఆలోచించి వేరే నక్కతో ఇలా అంది, "రోజూ సింహం మిగిల్చింది తింటున్నాము. సింహం ఎక్కువ తినడం వలన మనకి కావలసిన అంత మాంసం దొరకట్లేదు. అదే సింహం లేకపోతే మొత్తం అడవిలో ఉన్న జింకల్ని మనమే తినొచ్చు." అని అంటుంది. 

అది విన్న నక్క మిగిలిన నక్కలకి కూడా ఆ విషయం చెబుతుంది. అలా నక్కలు అన్నీ కలిసి ఒక పథకం పన్నుతాయి.

నక్కలు వాటి పథకం ప్రకారం ఒక రోజు సహజ సిద్దంగా చనిపోయిన ఒక కుందేలు మాంసంలో విషం కలిపి సింహం దగ్గరికి వెళ్ళి, "సింహమా, మేము రోజూ నువ్వు తినగా మిగిలింది తిని బ్రతుకుతున్నాము కదా అందుకోసం కృతజ్ఞతగా ఈ కుందేలు మాంసం తీసుకుని వచ్చాము." అని చెబుతాయి.

ఆ మాటలు నమ్మిన సింహం ఆ మాంసం తిని చనిపోతుంది. 

సింహం చనిపోయిన తర్వాత వేటాడటం తెలియని నక్కలు ఆకలితో అలమటించడం మొదలైంది. వేటాడటం చేతకాక చనిపోయి కుళ్లిన జంతువుల కళేబరాల కోసం కొట్టుకుని కొన్ని నక్కలు, అలా కుళ్లిన  కళేబరాలు తినడం వల్ల రోగాలు వచ్చి కొన్ని నక్కలు చనిపోయాయి. 

నీతి: 

1. దురాశ దుఃఖానికి చేటు. నక్కలు సింహం లేకపోతే మాంసం అంతా అవే తినేయొచ్చు అని ఆశ పడ్డాయి కానీ, వాటికి వేటాడటం రాదు అన్న విషయం మరిచిపోయాయి.

2. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. సింహం ఎప్పుడూ ఏమి పెట్టని నక్కలు తనకి మాంసం తీసుకుని వచ్చాము అని చెప్పగానే నమ్మేసి మోసపోయింది.

3. కృతజ్ఞతా భావం ఉండాలి. సింహం తాను తినగా మిగిలింది నక్కలు తింటాయి అని తెలిసినా ఏమీ అనలేదు. అది సహజ సిద్దంగా ఎంత తినగలదో అంతే తింటోంది. కానీ నక్కలు కృతజ్ఞత భావం లేకుండా స్వార్థంగా ఆలోచించి నష్ట పోయాయి.


Comments

Popular posts from this blog

The Gandhari within us...

Charles Ponzi - Father of Ponzi Schemes