మహాభారతంలోని గౌతమ - ఇంద్ర సంవాదం

ఆదిత్య శివ శంకర్ కలకొండ గారు ట్విటర్లో సంకలన చేసిన మహాభారతంలోని ఒక కథ...
మహాభారతంలోని ఈకథ చాలా విలువైనది, కాస్త పెద్దదైనా ఓపికగా చదివితే ఆంతర్యం అర్థమవుతుంది..
ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లిలేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. స్వాభావికముగా దయార్ద్రహృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకు వచ్చి పెంచుకున్నాడు. కాలక్రమేణ అది పెరిగి పెద్దదయింది. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగినాడు. గౌతముడు “తల్లీ తండ్రీ లేని ఈ ఏనుగును నాసొంత బిడ్డలా పెంచుకుంటున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది. యజ్ఞాలకు అడివినుంచి దర్భలు సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకు” అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు “నీవు అడిగినన్ని గోవులు కావలిసినంత బంగారము ఇస్తాను, ఈఏనుగును నాకు ఇవ్వు” అని అన్నాడు. “రాజా! దీని చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను, నీవు ఎన్ని గోవులిచ్చినా నాకు అక్కరలేదు, మునివేషములో ఉన్న నాకు హిరణ్యముతో అసలు అవసరములేదు” అని బదులిచ్చాడు గౌతముడు.
ధృతరాష్ట్రుడు “మునులకు అవసరమైనవి గోవులుకాని ఏనుగులు కావు. ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా! రాజునైన నేను స్వయముగా వచ్చి ఏనుగును ఇమ్మనినా కాదంటావా?” అని న్యాయం అడిగాడు.
అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు “పుణ్యాత్ములు ఆనందించే, పాపాత్ములు దుఃఖించే, యమలోకానికి వేళదాము రా! యమసభలోనే న్యాయనిర్ణయం జరుగని” అని అన్నాడు.
ధృతరాష్ట్రుడు: “నాస్తికులు పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు, ఆ దారుణమైన యమలోకములోకి నేను రాను.” 
గౌతముడు: “సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాము, అతనే న్యాయం చెప్తాడు.”
ధృతరాష్ట్రుడు: “అక్కాచెళ్ళెళ్ళను, తల్లిదండ్రులను దయతో చూసుకునే వారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు,నేను రాలేను.”
గౌతముడు: “అయితే వైకుంఠధామ సమానమైన గంగాతీరానికి వెళదాము, వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అతిథి అభ్యాగతులకు 
పెట్టి ఆ తరువాత తినే వాళ్ళే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలరు, నేనెందుకు వస్తాను?”
గౌతముడు: “పోని పవిత్రమైన మేరువనానికి రా!”
ధృతరాష్ట్రుడు: “సత్యము, దయ, మృదువర్తనము, భూతదయ ఉన్నవాడే అక్కడికి వెళ్ళగలడు, వేరే చోటు చెప్పు.”
గౌతముడు: “విష్ణుస్వరూపుడైన నారదుని విహారస్థలానికి వెళదాము, పద! అప్సరసలు కిన్నెరులు ఉంటారక్కడ”.
ధృతరాష్ట్రుడు: “సంగీత నృత్యాలతో దేవతార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరక్కడికి, నావల్ల కాదు.”
గౌతముడు: “అలాగా! అయితే దేవతలు విహరించే ఉత్తర కురుభూములకు వెళదాం రా!”
ధృతరాష్ట్రుడు: “కామము హింస మొదలైనవి లేని వాళ్ళు అక్కడికి వెళతారు. వచ్చుట నా తరము కాదు.”
గౌతముడు: “అమృతకిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయము చేసే చంద్రుని వద్దకు వెళదాము, సరేనా?”.
ధృతరాష్ట్రుడు: “దాననిరతులు, పరమ శాంతచిత్తులు అక్కడికి వెళ్ళగలరు. వచ్చుట నాకు సాధ్యము కాదు.”
గౌతముడు: “సమస్త లోకాలకు అన్నప్రదాత ఆసూర్యభగవానుడు, ఆయన వద్దకు వెళదాము, బయలుదేరు.”
ధృతరాష్ట్రుడు: “అమ్మో! తపస్స్వాధ్యాయనిరతులే ఆయన దర్శనము చేయగలరు, నన్ను విడిచిపెట్టు.”
గౌతముడు: “పోనీ వరుణుడి దగ్గరకు వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అగ్నిహోత్రము, యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు.”
గౌతముడు: “దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్థిద్దాము.”
ధృతరాష్ట్రుడు: “శూరులు, సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు, నేను రాను.”
గౌతముడు: “ప్రజాపత్య లోకానికి వెళదాము.”
ధృతరాష్ట్రుడు: “అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళకు స్థానమది.”
గౌతముడు: “గోలోకం?”
ధృతరాష్ట్రుడు: “తీర్థాలు సేవించినవారు, బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు 
గోలోకానికి చేరెదరు, నేనెలా రాగలను?”
గౌతముడు: “సరే! అయితే బ్రహ్మసభకు వెళదాము రా!”
ధృతరాష్ట్రుడు: “అసంగులు (లౌకిక బంధాలు లేనివారు) ఆధ్యాత్మవిద్య తెలిసిన వారు వెళ్ళగలరు అక్కడికి, నావంటి వాడు ఆ లోకము చూడనే లేడు.”
ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు “మహానుభావా! నీవు దేవేంద్రుడవు. 
ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవరికి తెలుసు?” అని పాదాభివందనము చేశాడు గౌతముడు.
“అయ్యా! నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు. మీరు మహానుభావులు కాబట్టి నానిజరూపం గుర్తుపట్టగలిగినారు, మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపఱచండి” అని 
ప్రార్థించాడు దేవేంద్రుడు. సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు.
***
ఈ కథలోని నీతిని తెలుసుకుందాము.
ఏ పుణ్యకార్యములు మనము చేయవలెనో తద్వారా ఏ ఏ పాపకార్యములు మనము చేయకూడదో వివరముగా దేవేంద్రుడు మనకు ఈ కథలో బోధించినాడు. 
(ధృతరాష్ట్రుడు అంటే శరీరమును ధరించినవాడు. అంటే మానవుడు. కాబట్టి మావనుడు ఏ పుణ్యకార్యాలు చేయాలో మనకు ఈ కథలో తెలిసింది) కానీ అందఱూ అన్నీ చేయలేరు. ఉదాహరణకు కలియుగములో అశ్వమేధ రాజసూయ యాగములు చేసే అర్హత మానవులకు లేదు. కాబట్టి అందఱూ చేయదగ్గ ఈ పుణ్యకార్యాలు మనము తప్పకుండా చేయాలి. 
తల్లిదండ్రుల సేవ, అతిథిసేవ, సత్యం, భూతదయ, గీతనృత్యాదులతో దేవతార్చన, దానము, స్వాధ్యాయనము, తీర్థయాత్రలు, బ్రహ్మచర్య పాతివ్రత్యాది వ్రతములు.
***
సర్వేజనాః సుఖినోభవంతు
***
ఇదం న మమ
శుభప్రదమైన రోజు 

Comments

Popular posts from this blog

The Gandhari within us...

Birth of Rama, Lakshmana, Bharata & Shatrughna

Indian Job Market - Emerging need for skills